Breaking News

పల్నాడు జిల్లాలో నాటు బాంబుల కలకలం

పల్నాడు జిల్లా బెల్లంకొండ మండలం పాపాయపాలెం గ్రామంలో నాటు బాంబులు బయటపడటం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పాడుబడ్డ ఇంట్లో దొరికిన ఈ బాంబులు గ్రామంలో భయాందోళనలకు గురిచేశాయి. సమాచారం అందుకున్న పోలీసులు.. తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో సుమారు ఐదు నాటు బాంబులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గతంలో ఓ హత్య కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తికి చెందిన ఇంట్లో ఈ బాంబులు దొరకడం ఇప్పుడు పలు అనుమానాలకు తావిస్తోంది. పాత కక్షల నేపథ్యంలో ఏవైనా అవాంఛనీయ ఘటనలకు ప్లాన్ చేశారా? అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఈ ఘటనతో అప్రమత్తమైన పోలీసులు.. బాంబు స్క్వాడ్ సహాయంతో గ్రామంలోని పలు అనుమానాస్పద ప్రాంతాల్లో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇంకా ఎక్కడైనా పేలుడు పదార్థాలు నిల్వ ఉంచారా అన్న అంశంపై ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం గ్రామంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

పల్నాడు జిల్లాలో నాటు బాంబుల కలకలం Read More »

పల్నాడు జిల్లాలో రెచ్చిపోయిన దొంగలు.. భారీగా వెండి ఆభరణాల అపహరణ

పల్నాడు జిల్లాలోని సత్తెనపల్లి పట్టణంలో దొంగలు రెచ్చిపోయారు. గోళ్లమూడి వారి వీధిలో ఉన్న నాగలక్ష్మి జ్యువెల్లరీ షాపులో దొంగలు చోరీకి పాల్పడ్డారు. దుకాణం తాళాలు పగలకొట్టి లోపలికి ప్రవేశించిన దుండగులు భారీ మొత్తంలో వెండి ఆభరణాలను అపహరించారు. ఈ చోరీ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. తాళాలు పగలకొట్టి చోరీ.. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈరోజు (గురువారం) ఉదయం షాపు యజమాని దుకాణానికి వచ్చేసరికి తాళాలు పగలకొట్టి ఉండటాన్ని గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దుకాణంలో పరిశీలించగా వెండి ఆభరణాలు కనిపించకపోవడంతో చోరీ జరిగినట్లు నిర్ధారించారు. దొంగలు సుమారు 2 కేజీల వెండి ఆభరణాలను ఎత్తుకెళ్లినట్లు సమాచారం. అపహరించిన ఆభరణాల విలువ దాదాపు రూ.5 లక్షలు ఉంటుందని అంచనా వేస్తున్నారు. చోరీకి పాల్పడిన వారు ముందస్తు ప్రణాళికతో వచ్చినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. క్లూస్ టీమ్ సహాయంతో ఆధారాలు సేకరించారు. పరిసర ప్రాంతాల్లో ఉన్న సీసీ కెమెరాల ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. స్థానికుల్లో ఆందోళన.. పల్నాడు జిల్లాలో వరుస చోరీ ఘటనలతో వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాత్రి వేళల్లో పోలీసులు గస్తీ మరింత పెంచాలని కోరుతున్నారు. చోరీకి పాల్పడిన నిందితులను త్వరగా పట్టుకుని కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

పల్నాడు జిల్లాలో రెచ్చిపోయిన దొంగలు.. భారీగా వెండి ఆభరణాల అపహరణ Read More »

పల్నాడు జిల్లాలో విషాదం.. పడవ బోల్తా పడి నలుగురి మృతి

పల్నాడు జిల్లా అచ్చంపేట మండలం కోనూరులో విషాద ఘటన చోటుచేసుకుంది. బంధువుల ఇంట్లో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన కొందరు వ్యక్తులు నదిలో చిన్న పడవలో విహారయాత్రకు వెళ్లగా, తిరుగు ప్రయాణంలో పడవ బోల్తా పడింది. అందులో ప్రయాణిస్తున్న మొత్తం పదిమంది నీటిలో మునిగిపోయారు. స్థానికులు వెంటనే స్పందించి ఆరుగురిని సురక్షితంగా రక్షించారు. అయితే మరో నలుగురు గల్లంతయ్యారు. అనంతరం చేపట్టిన గాలింపు చర్యల్లో ఇద్దరి మృతదేహాలు లభ్యమయ్యాయి. మరో ఇద్దరి కోసం సహాయక బృందాలు, స్థానికులు కలిసి గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటనతో కోనూరు గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు విచారణ చేపట్టారు. గల్లంతైన వారిని గుర్తించేందుకు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది.

పల్నాడు జిల్లాలో విషాదం.. పడవ బోల్తా పడి నలుగురి మృతి Read More »

ఏపీ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. పాత పెన్షన్ పునరుద్ధరణ, ఒక్క ఉద్యోగికి రూ. 3.39 కోట్ల మేర ప్రయోజనం

ప్రభుత్వ ఉద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెండు శుభవార్తలు అందించింది. మంగళవారం జరిగిన రాష్ట్ర కేబినెట్ భేటీలో ప్రభుత్వ ఉద్యోగులకు ఎంతో కాలంగా పెండింగ్‌లో ఉన్న 2 సమస్యలను పరిష్కరిస్తూ కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయాలు తీసుకుంది. 2004 సెప్టెంబరు కంటే ముందు జారీ చేసిన నోటిఫికేషన్ల ద్వారా ఉద్యోగాలకు ఎంపికై, వివిధ కారణాల వల్ల కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ విధానం (CPS) అమల్లోకి వచ్చిన తర్వాత విధుల్లో చేరిన ఉద్యోగులకు పాత పెన్షన్‌ విధానాన్ని (OPS) వర్తింపజేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. కేంద్ర ప్రభుత్వం దీనికి సంబంధించి 2020లోనే మెమో-57 జారీ చేసినప్పటికీ, గత ప్రభుత్వం దీనిని అమలు చేయలేదని మంత్రులు తెలిపారు. కూటమి ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం వల్ల రాష్ట్రంలోని 10,715 మంది ఉద్యోగులకు పదవీ విరమణ తర్వాత పాత పెన్షన్ ప్రయోజనం పొందనున్నారు. ఒక్కో ఉద్యోగికి రూ. 3.39 కోట్ల మేర ప్రయోజనంగతంలో 2017లోనే దేశంలో ఎక్కడా లేని విధంగా సీపీఎస్ ఉద్యోగులకు గ్రాట్యుటీ, ఉద్యోగి చనిపోతే వారి కుటుంబానికి పెన్షన్ ఇచ్చే నిర్ణయాన్ని అప్పటి చంద్రబాబు ప్రభుత్వమే తీసుకుంది. ఇప్పుడు మరోసారి ఈ 10 వేలకు పైగా ఉద్యోగులకు పాత పెన్షన్ పునరుద్ధరించడం ద్వారా ఒక్కో ఉద్యోగికి సగటున రూ. 3.39 కోట్ల మేర ఆర్థిక ప్రయోజనం లభించనుంది. దీనివల్ల 2026 నుంచి 2067 వరకు రాష్ట్ర ప్రభుత్వంపై దాదాపు రూ. 34,850.83 కోట్ల అదనపు ఆర్థిక భారం పడనుందని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. రిటైర్మెంట్ వయసు 62 ఏళ్లకు పెంచుతూ కేబినెట్ నిర్ణయంమరో కీలక నిర్ణయంలో భాగంగా, ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్లు, సొసైటీలు, షెడ్యూల్‌ 9, 10 పరిధిలోని సంస్థల్లో పనిచేస్తున్న రెగ్యులర్ ఉద్యోగుల పదవీ విరమణ వయసును 60 ఏళ్ల నుంచి 62 ఏళ్లకు పెంచేందుకు మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. గత ప్రభుత్వం ఈ ఫైల్ రెండుసార్లు తిరస్కరించినప్పటికీ, ఉద్యోగుల రిక్వెస్ట్ మేరకు సీఎం చంద్రబాబు సానుకూలంగా స్పందించగా, ఆయన కేబినెట్ ఆమోదం ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయాన్ని 2022 జనవరి నుంచి వర్తింపజేయాలని ఏపీ క్యాబినెట్ నిర్ణయించింది. దీనివల్ల ఇప్పటికే ఆయా సంస్థల్లో పదవీ విరమణ పొందిన ఉద్యోగులను తిరిగి విధుల్లోకి తీసుకుని, 62 ఏళ్లు నిండేవరకు కొనసాగనున్నారు ఈ నిర్ణయం వల్ల రాష్ట్రవ్యాప్తంగా 15 వేల మందికి పైగా కార్పొరేషన్ ఉద్యోగులకు లబ్ధి చేకూరనుంది.

ఏపీ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. పాత పెన్షన్ పునరుద్ధరణ, ఒక్క ఉద్యోగికి రూ. 3.39 కోట్ల మేర ప్రయోజనం Read More »